శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ | Ugadi Sabha 2024 (Telugu New Year) – 09th April 2024
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ | Ugadi Sabha 2024 (Telugu New Year) – 09th April 2024
మొక్కను భగవత్ స్వరూపంగా భావించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు.
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉగాది సభకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అధ్యక్షత వహించి ప్రసంగించారు. నేటి ఆధునిక యాంత్రిక యుగంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడం ద్వారా శాంతి, సహనం అనే రెండు ఆయుధాలు లభించి యుద్ధాలు రాకుండా నివారించవచ్చు, పంచభూతాలు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు అని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ఆధ్యాత్మిక భావన అలవర్చుకోవడం ద్వారా ఏకత్వ భావన అలవడి తద్ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో క్రోధాన్ని నివారించుకుని అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చని డా. ఉమర్ ఆలీషా స్వామివారు పిలుపు నిచ్చారు.
తాత్విక ఆలోచనా శక్తి ద్వారా హింసాత్మక వాతావరణం నివారించవచ్చు అన్నారు. ప్రతీ ఒక్కరూ సంవత్సరంలో 12 మొక్కలు నాటి, మన మన ప్రాంతాలను నందన వనాలుగా మార్చుకుని, ప్రకృతి వైపరీత్యాలకు రక్షణ వ్యవస్థగా వాటిని పరిణమింప చేసినట్లైతే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది అని అన్నారు. చేసే ప్రతీ మంచి పని ఆధ్యాత్మికతే, చెడును తొలగించి మంచిని పంపొందింప చేసేదే ఆధ్యాత్మికత అని డా. ఉమర్ ఆలీషా అన్నారు.
ఈ కార్యక్రమానికి మద్రాస్ విశ్వ విద్యాలయం, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకర రావు, AP రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సంపాదకులు శ్రీ షేక్ బాపూజీ, పిఠాపురం ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిట్ శ్రీ చిందాడ చిన్నోడు, ఉగాది విశిష్టతను సభకు వివరించిన All India Radio శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, పంచాంగ పఠనం చేసిన అవధాన దురంధర శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో మహమ్మద్ రసూలు వారి చరిత్ర అనే గ్రంథాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించి, వాటి ప్రతులను గ్రంథ ముద్రణకు సహకరించిన శ్రీ అన్నంరెడ్డి సోమరాజు, శ్రీమతి వీర గీతా వాణి కుటుంబ సభ్యులకు అందజేశారు. డా. విస్తాలి శంకర రావు, మద్రాస్ విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు మాట్లాడుతూ కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి రచనల్లో మహాభారత కౌరవ రంగంలో కౌరవుల ధర్మాచరణ, ఆధ్యాత్మికను గ్రంథంలో ఎంతో చక్కగా వివారించారు అని కొన్ని పద్యాలను ఉటంకించారు. శ్రీ షేక్ బాపూజీగారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషాగారి రచనలు స్కూల్ విద్యార్థులకు సిలబస్లో రూపొందించుట ద్వారా వారి రచనల ద్వారా విద్యార్థి లోకంలో సామాజిక చైతన్యం, తాత్విక చింతన అలవడుతుంది అని అన్నారు. శ్రీ చిందాడ చిన్నోడు పిఠాపురం ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిట్ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా గార్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారి వైశిష్ట్యాన్ని తెలిపారు. ఈ సభలో అశేష ప్రేక్షక జనులు హాజరై ఆద్యంతం తిలకించి పులకించారు.