National children’s day celebrations 2024

14th Nov 2024

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో సాయంత్రం 5 గంటలకు తాత్త్విక బాలవికాస్ పిల్లలచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బాల బాలికలు జాతీయ భాష హిందీలోనూ, మాతృభాష తెలుగులోనూ, అంతర్జాతీయ ఆంగ్ల భాషలోనూ ఆధ్యాత్మిక, దేశభక్తి గీతాలను ఆలపించారు. బాల బాలికలు చిన్నతనం నుండి తాత్త్విక చింతన జిజ్ఞాసతో ఉంటే వారి జీవితాలు ఉత్తమ ధీర లక్షణాలు కలిగి వికసిస్తాయి అని గురువర్యులు వారి యొక్క అనుగ్రహ భాషణంలో తెలియ చెప్పారు. తల్లితండ్రులు పిల్లలకు విజ్ఞానాన్ని అందించటానికి వారికి గ్రంథాలయాలకు వెళ్ళే అలవాట్లు చెయ్యాలని, ప్రతీ ఇంట్లో పిల్లలకు ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసి, అందులో పిల్లలకు స్ఫూర్తిదాయకమైన గ్రంథాలు ఉంచి వారికి చదివే అలవాటు చెయ్యాలి అని గురువర్యులు ఉమర్ ఆలీషావారు తల్లితండ్రులకు తెలియజెప్పారు.


కార్యక్రమ రూపకర్త ఏ. వి. వి. సత్యనారాయణగారు బాలల దినోత్సవం ప్రాముఖ్యత పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వారి కుమార్తె ఇందిరాగాంధీ వారు పిల్లలకోసం రచించిన ఉత్తమ గ్రంథాలు గురించి వివరించారు.
అతిథిగా వచ్చిన స్థానిక రాజకీయ నాయకులు శ్రీమర్రెడ్డి శ్రీనివాస్ గారు ప్రసంగిస్తూ పిల్లలకు తాత్త్విక విజ్ఞానాన్ని బోధిస్తూ ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దుచున్న పీఠం యొక్క సేవలను కొనియాడుతూ, ఇటువంటి సంస్థలు సమాజానికి ఎంతో అవసరం అని చెప్పారు. నేడు కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిన కారణంగా పిల్లలకు నైతిక విద్యకు అవకాశం తగ్గిపోయింది కనుక, ఆధ్యాత్మిక సంస్థల ద్వారా తల్లితండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇప్పించాలి అని కోరారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబుగారు మాట్లాడుతూ పిల్లల కార్యక్రమం నిర్వహణలో అవకాశం కల్పించిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియచేసారు. తాత్త్విక బాల వికాస్ ప్రేరకులు వై.అరుణకుమారి, వై.వెంకటలక్ష్మి, సి.హెచ్. వరలక్ష్మి గార్లు పిల్లలకు సహాయకులుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ ఎన్.టి.వి. ప్రసాద్ వర్మ వందన సమర్పణ చేసారు.

You may also like...