Katravulapalli Sabha | కాట్రావులపల్లి సభ | 13th Dec 2024
కాట్రావులపల్లి సభ పాద పూజ మహోత్సవం | 13th డిసెంబర్ 2024
భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఆరాధనలో పాల్గొన్న వారి కష్టాలు, దుఃఖాలు అధిగమించి, మనశ్శాంతి, ఆరోగ్యం, తృప్తి లభిస్తాయని పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేశారు. 13-12-24 శుక్రవారం ఉదయం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాదుకా పూజా మహోత్సవం స్థానిక కన్వీనర్ శ్రీ ఆకేటి సూరి పంతులు మాస్టారు ఆధ్వర్యవంలో వైభవంగా జరిగింది. ఆశ్రమ శాఖా నిర్వాహకులు, సభ్యులు పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా స్వామి వారికి పూలతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి వేద పండితులు గోపాల శర్మగారి ఆధ్వర్యవంలో పాదుకలు తొడిగి, వేద మంత్రాలతో గులాబీ పూలతో పాద పూజ వైభవంగా నిర్వహించారు. సూరి పంతులు మాస్టారు మాట్లాడుతూ సద్గురు ప్రబోధిత జ్ఞానము ద్వారా మానవుడు జ్ఞాన స్వరూపిగా పరిణామం చెందుతాడని, మానవ జన్మకు సార్థకత లభిస్తుందని అన్నారు. వేద పండితులు శ్రీ గోపాల శర్మగారు మాట్లాడుతూ పాదుకా పూజ విశిష్టతను సభకు వివరించారు. వందలాది సభ్యులు పాద పూజలో పాల్గొని ఎంతగానో ఆనందించారు.
పీఠాధిపతులు ఉమర్ ఆలీషా స్వామివారు మాట్లాడుతూ కాట్రావులపల్లి ఆశ్రమ నిర్మాణంలో శ్రీ సూరి పంతులు మాస్టారుగారి కృషి అనిర్వచనీయం. ఎందరో పిల్లలకు చదువు నేర్పి, వారిలో ఆధ్యాత్మిక పునాదులు వేసి, వారు ఉన్నత స్థానానికి వచ్చేలా కృషి చేశారని వారికి ఆశీస్సులు అందించారు. భక్తి, విశ్వాసం, లక్ష్యాలతో నిర్వహించే కార్యక్రమం మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి, భూగ్రహాన్ని రక్షించుకోవాలని కోరారు. భవిష్యత్తులో భయంకరమైన అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా 3 మొక్కలు నాటి, సామాజిక బాధ్యత నిర్వర్తించమని కోరారు. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పాద పూజలో పాల్గొన్న శ్రీ సూరి పంతులు మాస్టారిని, వేద పండితులు శ్రీ గోపాల శర్మగారిని స్వామి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పిట్టా సుగుణ రావు, మాజీ సర్పంచ్ శ్రీ సుంకర సీతారామయ్య మరియు ఎంతోమంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హారతితో సభ ముగిసింది.