6th Peethadipathi – Dr Umar Alisha

6వ పీఠాధిపతి బ్రహ్మరిషి డాక్టర్ ఉమర్‌ ఆలీషా

ఉమర్‌ ఆలీషా పిఠాపురానికి చెందిన కవి. ఈయన కాలం 1885-1945. ఈయన రాసిన పద్యాలు, గేయాలు, వచన కవితలతో ఒక సంకలనం ‘ఖండకావ్యములు’ పేరుతో 1950లో మొదటి ముద్రణగా అచ్చయింది. అటు తరువాత నాలుగో ముద్రణ 2010లో అయింది. 1911 నుంచి 1944 వరకు రాసిన కవితల సంకలనం అది.
గొప్ప కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిపై ఉమర్‌ ఆలీషా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది! ‘‘వెడలి పోయెద నీ విశ్వవీధి విడిచి/ కడచి పోయెద నక్షత్ర గతులు మీరి/ పాఱి పోయెదఁ బైలోక పథములకును/ నడచి పోయెద నల గగనాలు దాటి/ అధికులో యధములో యెవరైనఁగాని భ్రాంతులై నాదు వెంట రావలదు మీరు/ భక్తిమై నాదు వెంట రావలదు మీరు…’’ అని ఉమర్‌ ఆలీషా రాసింది చదివాక కృష్ణశాస్త్రిపై ఆయన ప్రభావం ఉందని తెలిసివస్తోంది. కృష్ణశాస్త్రికి ఉమర్‌ ఆలీషాతో సాన్నిహిత్యం ఉండేది. ‘ఆకులో ఆకునై…’ అంటూ కృష్ణశాస్త్రి రాసిన కవిత ఉమర్‌ ఆలీషా రాసిన సంశయం అన్న కవితలో కొంత భాగమే: ‘‘ఈ మంచు కొండల్లో/ ఈ మిట్ట పల్లాల/ ఈ మబ్బు యీ మాపు/ ఈ మాడ్కి నేనుండిపోనా/ ఈ ముసుగులో నే కలిసిపోనా/ ఈ చెట్లు ఈ తీగ/ లీ చేల ఈ పూల /ఈ చిత్ర చిత్రాల/ జూచి నే నాగిపోనా/వేచి నేనై కలిసిపోనా…. ఈ యేరు గాలిలో/ ఈ యడవి వీధుల్లో/ ఈ యాకు పొదల్లో/ నే యొంటిగా నిల్చిపోనా/ నే రాయినై కలిసిపోనా…’’ శిల్పం రీత్యా గమనిస్తే ఈ కవిత నుండే కృష్ణశాస్త్రి ‘ఆకులో ఆకునై’ వచ్చిందని తెలిసిపోతుంది. ఆకులో ఆకునై కవిత పరిధి కన్నా ఉన్నతమై ఉమర్‌ ఆలీషా కవిత ఒక గొప్ప ముగింపుతో ఉంటుంది. ‘‘ఇంక నస్తేయ మేది నాకేటి సిగ్గు/ ఇంక వ్రతభీతి యేది నాకేటి సిగ్గు’’ అని ‘నాకేటి సిగ్గు’ అన్న కవితలో ఉమర్‌ అలీషాహ్‌ అంటారు. ఆ మాటలే కృష్ణశాస్త్రి ‘‘నవ్విపోదురుగాక నా కేటి సిగ్గు’’ మాటలకు మూలం.
‘‘ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి’’ అని శ్రీశ్రీ అంటే ‘‘దర్పకుఁడు వచ్చి వంచిన ధనువువలెను/ పాలకడలిలోపలి వెండి పడవవలెను/ ప్రకృతి కన్య త్రావెడు పాన పాత్రవలెను/ నభముపైఁ దోఁచె రెండవనాటి విభుఁడు’’ అని అన్నారు ఉమర్‌ ఆలీషా.
‘‘ఈ ప్రణయ గీత మెందుండి యేగుదెంచు/ ఈ యమృత కంఠ మే వ్యక్తి నెనసి వచ్చు/ ఈ రసాత్మకాక్షర సమాధ్యాయ మెందు/ నణఁగియున్నది యెవరి దాస్యమునఁగలదు దాస్యశృంఖలాబద్ధ విద్యావధూటి/ కేది యీ రీతి స్వాతంత్య్ర మేది సొగసు/ ఏది నా పాట నా గీత మేది కవిత…’’ అని ఉమర్‌ ఉమర్‌ ఆలీషా అన్నది తెలిశాక మనకు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గుర్తుకు వస్తారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవితల స్థాయిలో ఉమర్‌ ఆలీషా గొప్ప కవితలు రాశారు.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చదవబడుతూనూ, గొప్ప కవితలుగానూ పరిగణించబడుతున్న జలాలుద్దీన్‌ రూమీ, ఖలీల్‌ జిబ్రాన్‌ కవితలకు దీటుగా ఉమర్‌ ఆలీషా కవితలు రాశారు. ఆయనది విశ్వస్థాయి రచనాసంవిధానం. సార్వకాలిక, సార్వజనీన కావ్యరచన ఆయనది.
‘‘ఎంతకాలంబు కన్నీళ్ల నీ విధాన/ కార్చి యెలుగెత్తి యేడ్చి నిన్‌ గాంచలేక/ జీవములుపుత్తు నో స్వామి చెప్పవేమి?/ ప్రాణములు నిల్పుదునో స్వామి పలుకవేమి?’’ అనీ, ‘‘ఎవరి కెవరు లేరు/ ఎవరి కేదీ రాదు/ చవిలేని ఈ పాట/ చాలించ రాదా?’’ అనీ, ‘‘ప్రొద్దుపొడిచే వేళ/ ప్రొద్దు కుంకే వేళ/ వద్దన్న రాగాలు వాలిపోతాయా?’’ అనీ, ‘‘ఊడల్లో ఉయ్యాల/ ఊగుచుండే ఊసు/ వాడల్లో చెప్పితే/ అర్థమవుతుందా?’’ అనీ, ‘‘అసువులు నోట వచ్చినవి యక్కట నీకయి నిల్చి యుండె నో/ బిసరుహనేత్ర నే చనిన వెన్కను వచ్చిన లాభమేమి నిన్‌/ కసిమస వీడునే వలపు నన్‌ గల శక్తి నినున్‌ దహియింపఁగా/ ససియని రాకపోయిన శ్మశాసనమునొద్దకు రాకపోదువే’’ అని, ‘‘ప్రాణములు నీదు పాదాల పైని విడిచి/ మట్టినై నీవు త్రొక్కెడి మార్గమందు/ నుండ నూహింతు జీవిత ముండు వఱకు/ నేడ్చుచుందును నిన్ను వీక్షించు కొఱకు’’ అని ఉమర్‌ ఆలీషా అన్నవి తెలిశాక ఆయన విశ్వకవి అని అవగతమౌతుంది. ‘‘మావారి రక్తంబు/ మావారి కండలు/ మావారి ప్రాణాలు/ ఈ నేల బలివేసి/ ఈ భూమి తెగకోసి/ ఈ పొలములో దోసి/ మేము గడియించి, యిట/ మేము నివసించి/ పండించినాము యీ/ ఎండిపోయిన బీళ్లు ఖండించినాము…’’ అనీ, ‘‘దోర్థండ రక్కసి రాళ్ల/ నిండించితిమి ప్రేమ/ రసవాహినుల…’’ అని కూడా ఉమర్‌ ఆలీషా అన్నారు.
ఉమర్‌ ఆలీషా 68 పాదాల ఉత్పలమాలిక రాశారు! కర్ణాటక సంగీతంలోని కీర్తనల కర్తలలా ఉమర్‌ ఉమర్‌ ఆలీషా కవితల్లో కొన్నిటికి తమ పేరును నామ ముద్రగా వాడారు. పారశీ కవులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. దాన్ని తఖల్లుస్‌ అంటారు. అరబీ, ఫార్సీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఉమర్‌ ఆలీషా 1916లో ఫార్సీ మస్నవీని తెలుగులోకి అనువదించారు. కవి హాలీ రచనల్ని అనువదించారు. ఇక్బాల్‌ కవి రాసిన ‘‘చీనా అరబ్‌ హమారా…’’ రచనను అనువదించారు.
తొలిసారి తెలుగులోకి రుబాయీని తెచ్చిన కవి ఉమర్‌ ఆలీషా. 1923లో ఫార్సీ కవి హాఫిజ్‌ రుబాయీలు కొన్నిటిని తెలుగులోకి అనువదించారు ఆయన. 1924లో రాయప్రోలు సుబ్బారావు ఉమర్‌ ఖయ్యాం రుబాయీలను ఫిట్జ్‌ జెరాల్డ్‌ ఇంగ్లీష్‌ అనువాదం నుండి తెలుగులోకి అనువదించారు. ఉమర్‌ ఖయ్యాం రుబాయీలకన్నా ముంఉమర్‌ ఆలీషా ద్వారా హాఫిజ్‌ రుబాయీలు తెలుగులోకి వచ్చాయి. తెలుగులోకి వచ్చిన తొలి ఫార్సీ రుబాయీ: ‘‘జయ మీ వెజ్జునిరాక నాడిని పరీక్షన్‌ జేయు జీసస్సు దు/ ర్జయ దుఃఖాల వేలార్ప కశ్రువుల; జోస్యంబాడుచుంటిన్‌ ద డ/ క్షయ తేజస్సున కేనెకా దవసి ‘మూసా’ వచ్చి యాచించు ని/శ్చయ మీవీటికి వచ్చువారలు నిరాశన్‌ వోయిరే యెవ్వరేన్‌.’’ 1926లో భారతి పత్రికలో ఉమర్‌ ఖయ్యాం రుబాయీలను నేరుగా ఫార్సీ నుంచి అనువదించి ప్రకటించడం మెదలుపెట్టారు ఉమర్‌ ఆలీషా. 720 ఉమర్‌ ఖయ్యాం రుబాయీలను అనువదించారు. మనదేశంలో స్వామి గోవింద తీర్థ తరువాత ఎక్కువ సంఖ్యలో ఉమర్‌ ఖయ్యాం రుబాయీలను అనువదించినది ఉమర్‌ ఆలీషా. ఉమర్‌ ఖయ్యాంను అర్థం చేసుకోవడానికి తెలుగులో ఉమర్‌ ఆలీషా అనువాదాలే సరైనవి. తెలుగులో వచ్చిన ఉమర్‌ ఖయ్యాం రుబాయీల అనువాదాల్లో ఉమర్‌ ఆలీషా చేసినదే మేలైనది. తెలుగులో తొలిసారి రుబాయీ తరహా రచన అంటే 1, 2, 4 పాదాల్లో కాఫియా (rhyme) తో రాసిన కవి ఉమర్‌ ఆలీషా. ఉమర్‌ ఖయ్యాం రుబాయీని రుబాయీ పోకడలో ఉమర్‌ ఆలీషా ఇలా అనువదించారు: ‘‘మనుజ కోటిలో దెలివిగా మసలవలయు/ నెల్ల పనులందు శాంతిమై నెసగవలయు/ శ్రవణ నయన జిహ్వేంద్రియ శక్తులెంత/ గలిగియున్నను లేనట్లె మెలగవలయు’’.
ఉమర్‌ ఆలీషా ‘‘భరతమాత’’ అన్న జాతీయ కవి. ‘‘యోగ సమాధి’’, ‘‘మోక్షసిద్ధి’’ అంటూ భారతీయతను నింపుకున్న కవి. ‘‘జాతీయవిద్య’’, ‘‘జన్మభూమి’’, ‘‘శ్రీరాముడు’’ అంటూ గొప్పగా రాయడమే కాకుండా దేశమాత దండకాన్ని కూడా రాశారు! గత వందేళ్లలో శేషేంద్ర శర్మ, విశ్వనాథ సత్యనారాయణలతో పాటు తెలుగులో అంతర్జాతీయస్థాయి కవిత్వం అందించిన వారు ఉమర్‌ ఆలీషా. ప్రస్తుతం ప్రపంచంలో ఏ విధమైన కావ్యరచనా సంవిధానం గొప్పదని ఎక్కువగా చదవబడుతోందో ఆ సరళిలోనూ, ఆ భావపుష్టితోనూ ఉమర్‌ ఆలీషా కవిత్వం రాశారు.
కవిగా వీరి గురించి తెలుగువాళ్లకు పెద్దగా తెలియరాక పోవడం తెలుగు కవిత్వానికి జరిగిన హాని. ఆరుద్ర తమ సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఉమర్‌ ఆలీషాను ఎందుకు ప్రస్తావించ లేదో? ఇతర సాహితీ చరిత్రకారులు కూడా పెద్దగా ఉమర్‌ ఆలీషా ప్రస్తావన చెయ్యలేదు. ఈ వ్యాస రచయిత ఇటీవల కొన్ని ఉమర్‌ ఆలీషా కవితల్ని ఇంగ్లీష్‌లోకి అనువదించి అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల వెబ్‌ పోర్టల్స్‌లో ప్రకటించడం జరిగింది. కొన్ని దేశాల వాళ్లు ఉమర్‌ ఆలీషా కవిత్వం గొప్పగా ఉందని తెలియజేశారు. ఉమర్‌ ఆలీషా వంటి ఒక గొప్ప తెలుగు కవి తెలుగువాళ్లకు అంతగా తెలియకపోవడం బాధాకరం.
తెలుగు అధ్యాపకులూ, పరిశోధకులూ ఉమర్‌ ఆలీషా కవిత్వంపై దృష్టిపెట్టి ప్రస్తుత, భవిష్యత్‌ తరాల వారికి ఆయన కవిత్వాన్ని ఒంటబట్టించాల్సిన అవసరం ఉంది.
ఆ వాదం, ఈ వాదం అంటూ గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు కవిత్వం చెల్లాచెదురైపోయింది. ఈ పరిస్థితిలో ఉమర్‌ ఆలీషా గారి కవిత్వం తెలుగుకు ఎంతో అవసరం. మన తెలుగులో వచ్చిన గొప్ప కవిత్వానికి మనం పాఠకులం అవ్వాల్సిన అవసరం ఉంది. గొప్ప కవిత్వానికీ, అంతర్జాతీయ స్థాయి కవిత్వానికీ అలవాటుపడాల్సిన క్రమంలో భాగంగా ఉన్నపళాన మనం ఉమర్‌ ఆలీషా కవిత్వానికి మాలిమి అవాల్సిన అవసరం ఉంది. ఉదాత్తమైన ఉమర్‌ ఆలీషా కవిత్వానికి ఇకనైనా ఉన్నతమైన స్థానం రావాల్సిన అవసరం ఉంది.

https://www.andhrajyothy.com/telugunews/manako-visvakavi-ngts-editorial-192203281214272