‘కవి శేఖర’ డా౹౹ ఉమర్ ఆలీషా గారి 74వ వర్థంతి సభ భీమవరం లో జరుగుతున్న సంధర్భంలో వారు రచించిన గ్రంధాల సమాచారం
త్వరలో 23-01-2019వ తారీఖున ‘కవి శేఖర’ డా౹౹ ఉమర్ ఆలీషా గారి 74వ వర్థంతి సభ భీమవరం లో జరుగుతున్న సంధర్భంలో వారు రచించిన గ్రంధాల మరింత సమాచారం.
డా౹౹ ఉమర్ ఆలీషా సాహితి సమితి,
భీమవరం
ఇలాజుల్ గుర్బా
డా౹౹ ఉమర్ ఆలీషా గారు అంగడిలో లభించే మూలికలతో చికిత్సను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా “ఇలాజుల్ గుర్బా” అనే వైద్య గ్రంథాన్ని ఉర్దూ భాష నుండి భాషనుండి తెలుగులోకి 1918లో అనువదించారు. ప్రధమంగా ఈ గ్రంథాన్ని మహ్మద్ అజగర్ అలి అను వైద్యుడు పారశికంలో రచించగా తరువాత కాలంలో దీనిని హకీం గులాం ఇమామ్ ఉర్దూలోకి భాషాంతరీకరణం చేశాడు. ఈ గ్రంథం డా౹౹ ఉమర్ ఆలీషా గారికి మిత్రులైన బ్రహ్మశ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రుల కోరిక పైన ఆలీషా గారు దీన్ని ఆంధ్రీకరించి దానిని వెంకటేశ్వర శాస్త్రి గారి తాతగారికి అంకితం ఇచ్చారు. ఈ బృహత్ కార్యక్రమానికి వీరి బావగారైన మున్షీ మహ్మద్ హుస్సేన్ గారు సహకరించారు.
ఈ గ్రంథానికి అద్భతమైన ఉపోద్ఘాతం వ్రాసారు ఆలీషా గారు. వైద్యులనే వారు ఈ లోకమే శాశ్వితమని తామేమో మూటగట్టుకొని లోభత్వమున అమూల్యరత్న సదృశ్యమైన మంచి మంచి చికిత్సలు దాచుకొని గాని, భాషాంతరీకరణలో అర్ధంకాని గూఢ పదాలను ఉపయోగించి గాని అభ్యాసకుల హృదయాలను వ్రణములు గావించారని ఆవేదన పడతారు ఆలీషా ఈ “ఇలాజుల్ గుర్బా” రాసిన చికిత్సకుడు ఎంత నిస్వార్ధపరుడో , యెంత పరోపకార పారాయణుడో ఈ పుస్తకం ఒక్కసారి చదివితే చాలంటారు.
డా౹౹ ఉమర్ ఆలీషా కావ్య కిరణావళి
ఇలాజుల్ గుర్బా – పేదలచికిత్స
శ్రీ త్సటవల్లి మురళీకృష్ణ
నాటకం ‘అనసూయ’ రసపేయ
మహాకవి డా౹౹ ఉమర్ ఆలీషా గారు రచించిన ‘అనసూయ’ నాటకం పంచమాంకారంభంలో ఆత్ర్యాశ్రమంలో అనసూయా దేవి రాట్నం వడుకుతూ ప్రవేశిస్తుంది. పురాణ ప్రసిద్ధ పాత్రలచే రాట్నం వడికించడం కొంచెం ఎబ్బెట్టుగానే తోచవచ్చు. ఈ కవిగారి కాలంలో గాంధీజీ ఖాదీ ఉద్యమం వ్యాప్తిలో ఉంది. అప్పటి జనానికి స్ఫూర్తిని కలిగించడం కోసం ఈ సన్నివేశాన్ని ప్రవేశపెట్టారు అయితే ఇది ఎబ్బెట్టుగా లేదు.
బ్రాహ్మణ వేషధారులై అతిధులుగా వచ్చిన త్రిమూర్తులలో రుద్రుడు
”మలిమసవస్త్రములతో నెట్లు అన్నము వడ్డింప వచ్చినది? అంటాడు.అప్పుడాత్రి అవి మలిన వస్త్రములు కావు ౼ మడి బట్టలంటాడు. అంతట బ్రహ్మ మడి బట్టలైనచో నవి సాలెవాని గంజిలో నాని, చాకలివాని బానలో మరిగి, మురికి నీళ్ళతో ముంచి యెత్తబడిన యా వస్త్రము మడిబట్ట మెట్లగును? అంటాడు. అప్పుడాత్రి ఈ వస్త్రములను మేమిరువురము స్వయముగా రాట్నముపై నూలు వడికి నేసి మడికై వాడుచున్నాము (4అం.౼70పుట) అని అంటాడు. అలా పౌరాణికపాత్రయైన అనసూయచే రాట్నం వడికించిన ఈ సన్నవేశాన్ని ఆత్రిమహర్షి పలుకుల ద్వారా చక్కగా ఔచితీ మహితంగా కథలో కలిపి వేశారు ఈ కవిగారు ఇలా ఈ నాటకం ‘అనసూయ ౼ రసపేయ’
డా౹౹ రామడుగు వేంకటేశ్వర శర్మ
డా౹౹ ఉమర్ ఆలీషా కావ్య కిరణావళి
కవిత్వము
కవిత్వము రసావేశము. ప్రేమమయ స్వరూపమైన యొక అపురూపమగు సత్పదార్ధము. ఇతమిత్థమని నిర్వచించుట కవకాశము లేని ప్రణావాత్మకమైన జ్యోతి. అతేంద్రియములగు మహా పదార్ధములలో నొకటి. సర్వాంగ సుందరమైన దీని నిజ స్వరూపమును దెలిసికొనుట మిగుల దుర్ఘటమైన పనియే యైనను, కొన్ని వాక్యాభాస, యుక్తాభాసములవలన విమర్శించి కొంతవఱకు గ్రహింపవచ్చునని తొచుచున్నది.
కొందఱు కవిత్వము కేవలము కాలక్షేపము కొఱకై పెట్టుకొను బెడదయని దీని యందుదయించు ఫలము శూన్యమని వాదించుచు ప్రకృతి శాస్త్ర జ్ఞానమే అన్నిటికన్న నుత్తమమైన దని చెప్పు చున్నారు. కాని ప్రకృతి శాస్త్రజ్ఞానము (Science) అంతఃకరణ చతుష్టయము నందొకటైన బుద్ధికి మాత్రమే వికాసమును గలిగించి జ్ఞానశక్తి నభివృద్ధిని గావించుచున్నది. కవిత్వ మట్టిది గాదు.
కవిత్వము బుద్ధ్యాది సమస్తేంద్రియములకు వికాసమును, తేజస్సును ఆనంద సంధాయకమైన మహా శక్తిని గలిగించుచున్నది. మఱియు అమృతము నందలి యజరామరత్వమును, మధుపానమునందలి మైకమును, తపస్సునందలి యాధ్యాత్మిక శక్తిని, కుసుమముల యందలి రామణీయకమును ఇట్లు ఒకటియేమి, తేజో విరాజితమైన యనంత శక్తిలే కవిత్వమునకే యలవడి యున్న వనుటలో నతిశయోక్తి నొకింతయు లేదు.
సేకరణ
బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా
వ్యాసాలు ౼ ఉపన్యాసాలు
‘మహా కవి’ డా౹౹ ఉమర్ ఆలీషా గారి విద్యాబ్యాసం
శ్రీ ఉమర్ ఆలీషా పిఠాపురం హైస్కూలులో చదివారు. ఆరోజులలో దక్షిణాదిన ఉత్తరాదిన ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు గాను, సుప్రసిద్ద సాహితీ వేత్తగాను పేరు నిలుపుకొన్న శ్రీ కూచి నరసింహం ఆలీషా గారి గురువులు.
సంస్కృతాంధ్రాల్లో అప్రతి హతమైన ప్రతిభకల బ్రహ్మశ్రీ పురాణపండ మల్లయ్యశాస్త్రి వద్దను, శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రులు, శ్రతమన్న శాస్త్రి వద్దను శ్రీ ఉమర్ ఆలీషా సంస్కృతాంధ్రాలు అధ్యయనం చేశారు.
( కురుమెళ్ల వేంకటరావు, మా పిఠాపురం, పు.130)
తండ్రి గారి సభ ఒక వేదాంత పీఠంగా విలసిల్లేది. ఆలీషా గారు తండ్రికి తగిన తనయులు. అరబ్బీ, పర్షయన్, ఉర్దూ భాషలు ఆలీషా గారికి కరతలామలకమయ్యాయి. సంస్కృతాంధ్రాలు తలస్పర్శగా అధ్యయనం చేసి మంచి విద్వత్తు గడించారు. హీందీ భాషలో అభినివేశం ఉంది. “ఆంగ్లమున వ్రాయుట మాట్లాడుట యెరుగుదురు. ఆంగ్ల పద్య కావ్యములందు వీరికి ఎంతమాత్రము ప్రవేశము లేదు.
(మహమ్మద్ కబీర్షా, ఉమర్ ఆలీషా విజ్ఞాన సర్వస్వము)
మొల్ల
రామాయణ పారాయణమున చేతనే అనేకులు తరించుచుండ రామాయణ మహాకావ్యమును వ్రాసిన మొల్లకు దోషములున్నవని ఆంధ్రులన జాలరు. అనగా విషయాసక్త రామాయణ కావ్యం వ్రాసి రస సముజ్వల తేజముతో సమన్వయింప జాలదు. మొల్ల రామాయణ మత్యంత మనోహరము. పూరమునైయున్నది. ఇది యొక తపస్విని వ్రాసినది కానోపునా యనితోచు భాగములందు లేకపోలేదు. నాఋషిః కురుతే కావ్యం అను నార్యోక్తి విననివారులేరు కాక, రామాయణమున నొక చక్కని యుపదేశము.
రావణుడా నీవు కామరూపధారివిగదా! ఏల సీతకై యింత విలపించెదవు?
అని ఒకరడిగిరి.
రావణుడు:- రామునకు గాని సీత మనసియ్యదు.
ఒకరు:- నీవేల రామరూపము దాల్చరాదు?రావ:- దాల్చగలను గాని రామరూపధారి కాగానే నాకు కామము నామముకైన గానరాదు. అని చెప్పినాడు
కవి వ్రాయు పాత్రతానైన గాని ఆపాత్ర కౌచిత్యభంగముగా వించకుండ నిర్వహింపజాలడు అదిగాక కవి తానేది వ్రాయునో అది తానైపోవుట స్వభావము. మొల్ల రామాయణమున నన్నియోసారులు రాముడు, సీత, అయినది. పవిత్రమైన వారిచే నపవిత్రులైన రావణ కుంభకర్ణుల నిర్జింపజేసినది. ఇంక నట్టియామె యెడ కులటా ప్రసంగమెక్కడిది? అనగా కులటయైన నిట్టి కావ్యము వ్రాయుట మిధ్య. ప్రకృతి నట్టి వారి నణచిపెట్టియే నుంచును.
ఎవరియెడ యేనిందారోపణఁజేసినను స్త్రీ ల యెడ మాత్రము నిదర్శనములేనిదే నిందించుట చాల దోషము.
(ఆంధ్రలక్ష్మి, ఏప్రియల్,1923 సంవత్సరం)
1935వ సంవత్సరంలో శ్రీ పూళ్ళ సుబ్బారావు గారు వ్రాసిన ‘పెండ్లి పాటలు’ పుస్తకానికి ‘మహాకవి’ డా౹౹ ఉమర్ ఆలీషా గారు ముందుమాటగా వ్రాసిన ఆశీర్వాద పద్యాలు
సేకరణ
డా౹౹ రంకిరెడ్డి రాంమోహన రావు
ఐతంపూడి
‘కవిశేఖర’ డా౹౹ ఉమర్ ఆలీషా గారు రచించిన నాటకాలలో నాటక లక్షణాలతోపాటు తమ నాటకాల సృష్టిలో వారిదంటూ ప్రత్యేకతను చూపించారు. వీరి సంభాషలు, భాష,పాటలు, లేఖలు, పాత్రపోషణ, మనఃప్రవృత్తుల చిత్రణ, నాటకీయ వ్యంగ్యం, రసపోషణ, వర్ణనలు, అలంకారాలు, చంధస్సు, సామెతలు ఇత్యాది విషయాలు ‘ఉమర్ ఆలీషా నాటకాలు – విశ్లేషణ’ ఎం. ఫిల్.పట్టం పొందిన సిద్దాంత వ్యాసంలో షేక్ రియాజుద్దీన్ గారు పొందుపర్చారు. అందులో ఒక అంశం
◆◆సంభాషణలు ౼ భాష◆◆
నాటకం సమస్త ప్రజానికానికి ఆకర్షణీయం. ఆదరణీయం.కాబట్టి సులభగ్రహ్యార్థమై పాత్రోచిత భాషను ప్రయోగించడం సర్వాంగీకారంగా చెప్పవచ్చు. ప్రచీన కాలంలో సంస్కృత నాటక కర్తలు పాత్రోచిత భాషను ప్రయోగించి నాటక రచనలు చేశారని తెలుస్తుంది. వారు ఉత్తమ, మధ్యమ, నీచ పాత్రలుగా విభజించుకొని రచన చేశారన్నది అందరికి విదితమే. శ్రీ కోలాచలం శ్రీనివాసరావు, శ్రీ వేదం వేంకటరాయ శాస్త్రి ఇత్యాది నాటక కర్తలు పాత్రలకు తగిన భాషను ప్రయోగం చేశారు.తదనుగుణంగా ఉమర్ ఆలీషా గారు కూడా తమ నాటకాలలో ఉత్తమ, మధ్యమ పాత్రలకు గ్రాంథిక భాషను, నీచ పాత్రలకు వ్యవహారిక భాషను ప్రయోగించారు. వీరు అలతి అలతి పదాలతో కూడిన సంభాషణలను, సంస్కృత భూయిష్ట సమాసాలను కూడా ప్రయోగించారు.
ఉమర్ ఆలీషా గారు ‘మహాభారత కౌరవరంగము’, ‘అనసూయాదేవి’, ‘దానవవధ’, ‘చంద్రగుప్త’, ‘కళ’, మణిమాల’, నాటకాలన్నిటిలోను పాత్రోచిత భాషను ప్రయోగించారని చెప్పవచ్చు.
షేక్ రియాజుద్దీన్ అహమద్
‘ఉమర్ ఆలీషా నాటకాలు – విశ్లేషణ’
తే౹౹గీ౹౹ జగము మిధ్యని కొందరు చాటుచుంద్రు
బ్రహ్మ మిధ్యని కొందరు బలుకుచందు
రిర్వురిటు మిధ్యావాదులే జగాన
నేదియును మిధ్యగాదు నీ వెరింగియున్న
ఈ పద్యంలో ఉమర్ ఆలీషా ఆదిశంకరులకంటె ఒక అడుగు ముందుకు వేశారు. ఇది మామూలుగా చెప్పాలంటె గొప్ప ఛాలెంజ్. బ్రహ్మసత్యం,జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవనాపరః అన్నది శంకరుల పరమ సిద్దాంతం. శంకరులు జగత్తును మాథ్గగా భావించారు. వేలాది సంవత్సరాలుగా వేలకొద్ది యోగులు జగత్తును మిథ్యగానే భావించారు. అద్వైత వేదాంతంలో “అధ్యాస” గొప్ప సిద్దాంతం. ఈఅధ్యాస పునాదుల మీదే ఆది శంకరులు అద్వైత సిద్దాంత భవంతిని నిర్మించారు. ఆలీషా గారు దీనిని సునాయాసంగా తృణీకరించారు. జగత్తు కూడా ఆయన సత్యమనే చెప్పారు. అయితే కొందరు బ్రహ్మను కూడా మిధ్యగా భావించారు. ఆలీషా గారు జగత్సత్యం, బ్రహ్మసత్యం అని సిద్దాంతికరించారు. దీన్ని ఆయన ఏదియును మిథ్య కాదు అని తీర్పు చెప్పారు. పై సిద్దాంత కర్తలిరువురూ(జగన్మిథ్యా, బ్రహ్మమిథ్యా ) మిథ్యావాదులే. కాని జగత్తు, బ్రహ్మ రెండు సత్యమేనన్న సత్యాన్ని ఆవిష్కరించారు.
డా౹౹ రంకిరెడ్డి రాంమోహనరావు
డా౹౹ ఉమర్ ఆలీషా కావ్య కిరణావళి
మధువును మానినీ ప్రణయ మంజలగాన సుధా ప్రపూర్ణ స
త్పథమును మైకమును మైకమీ త్రయ మవస్యము లేయెడ మర్త్యకోటికిన్”
వంటి పద్యాల వల్లను అశాశ్వతమైన ఇహలోక జీవితంలో తృప్తితీర మధుపాన మొనర్చి, సుందరాంగులతోకూడి ఆనందం అనుభవించడమే జీవిత పరమావధి అని ఖయ్యామ్ బోధించినట్లు స్పష్టమైంది. శృంగార రసభావాలతో నిండిన అనేక పద్యాలతో పరలోకాన్ని మరపించి ఇహలోకంపై వ్యామోహం పెంచాడు ఖయ్యామ్. ఈతత్త్వం కొందరికి అనంతమైన ఆనందం కలిగించింది. మరికొందరికి బాధ కలిగించిది. మరికొందరు ఖయ్యామ్ సృష్టించిన మధువు – మానిని గుర్చి సుదీర్ఘంగా ఆలోచించారు. మధువు ద్రాక్షాసవమేనా; వలచిన నెచ్చెలి మైమరపించి సుఖాలనోలనాడించే మదిరాక్షియేనా, అన్నది వారి సందేశం.
“అసలీతడు(ఉమర్ ఖయ్యమ్) విషయాసక్తుడే కాదని, ఇతని వేదాంతములోని మధువు ధ్యానామృతమని, కాంత ముక్తికాంతయని, విషయోప భోగములు సమాధి నిష్టా విధానములని తూచలు పొల్లు పోకుండ అర్థములు చెప్పు వారును కలరు”
ఉమర్ ఆలీషా, (ఉమర్ ఖయ్యామ్)
“ఉమర్ ఖయ్యామ్ అతి కాంక్షతో వలచిన భోగము కేవల భక్తి పారవశ్య జనితానందరేక మనియు, తాగిన మధువు భగవత్పార వింద ధ్యానామృతమనియు, కామించిన పరాశక్తి సచ్చిదానంద స్వరూపమగు బ్రహ్మమే యనియు నిరూపించెదరు”
డా౹౹ బూర్గుల రామకృష్ణా రావు, సారస్వత వ్యాస ముక్తావళి
డా౹౹ ఉమర్ ఆలీషా సాహితి సమితి
భీమవరం