Kavisekhara Dr. Umar Alisha 140th Birthday Celebrations at Lalitha Kala Parishath, Ananthapuram
“కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 140వ జయంతి ఉత్సవాలు” లలిత కళ పరిషత్, అనంతపురం 28.2.2025
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం, షష్ఠ పీఠాధిపతి మహాకవి, బహుభాషా పండితులు ఉమర్ ఆలీ షా వారి నూట నలభైవ జయంతి ఉత్సవాలు అనంతపురం ఉమర్ ఆలీషా సాహితీ సమితి వారి ఆధ్వర్యవంలో మొట్టమొదటిగా ఘనంగా జరిగాయి. సభాధ్యక్షులుగా శ్రీ జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి వారి ఆసక్తి దాయకమైన వ్యాఖ్యానంతో సభ ఆదినుండి అంతం వరకు సభికులను ఆధ్యాత్మిక, సాహిత్య తరంగాలలో ఓలలాడించింది. తోట నాగరాజుగారి ఆహ్వాన పలుకులతో ప్రత్యేక అతిథి పీఠాధిపతులు శ్రీ డా. ఉమర్ ఆలీషావారిని, విశిష్ట అతిథులుగా కవులు, విమర్శకులు, సాహితీవేత్తలు అయిన శ్రీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ పతిక రమేష్ నారాయణగార్లను, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలకగా, గౌరవ అతిథులుగా లలిత కళా పరిషత్ అనంతపురం కార్యదర్శి శ్రీమతి గాజుల పద్మజగారు, అనంతపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ జి.ఎల్. మురళీధర్ గారు పాల్గొన్నారు. పీఠం చరిత్రను శ్రీ షేక్ రియాజూద్దీన్ అహమద్, అనంతపురం ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షులు వినిపించగా, అనంత సాహితీ సమితి ఆవిర్భావం గురించి శ్రీ గుంటు మురళీకృష్ణ భరద్వాజ్ వివరించారు.
భీమవరం ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేష్ చంద్రాజీ గారి ఆత్మీయ వచనములు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నేటి భారత దేశం, మత సామరస్యంపై వ్యాసరచన పోటీలో పాల్గొన్న పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు గురువర్యులు ప్రశంసా పత్రములు, పతకాలు బహూకరించారు. బ్రహ్మర్షి ఉమర్ ఆలీ షా వారు వ్రాసిన వెయ్యి పద్యాల కావ్యం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర పై వ్యాఖ్యానం వ్రాసిన పుస్తకాన్ని గురువర్యులు ఆవిష్కరించగా, ఆ పుస్తక రచయత రమేష్ నారాయణ గారిని గురువర్యులు అభినందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు తమ ఉపన్యాసంలో 20వ శతాబ్దపు కవులలో మానవత్వాన్ని, సమాజంలోని రుగ్మతలను ప్రధాన అంశంగా తీసుకుని కవిత్వం వ్రాసిన కవులైన గురజాడ అప్పారావు, గుఱ్ఱం జాషువా కోవకు చెందిన ఉమర్ ఆలీషా వారు సమాజ శ్రేయస్సు కొరకు ఆధ్యాత్మిక, అభ్యుదయ, పరతత్త్వ, వేదాంత, బ్రహ్మ విద్య వంటి ఐదు అద్భుతమైన అంశాలు పై కవిత్వం వ్రాసిన బహుముఖీనులైన కవివర్యులని శ్లాఘించారు. అటువంటి కవి ముస్లిం సమాజంలో జన్మించడం అరుదైన విషయం అని కొనియాడారు. నేడు వారి వారసులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు ఆధ్యాత్మికతతో పాటు సాహిత్య, సామాజిక సేవలు చేయడం బహుధా హర్షణీయమని చెప్పారు. శ్రీమతి బోయ గిరిజమ్మగారు మాట్లాడుతూ ఉమర్ ఆలీ షా వారు అనంతపురంలో అడుగు పెట్టడం, ఇటువంటి సాహిత్య సభను ప్రోత్సహించడం, మహనీయుడు, మహాకవి ఉమర్ ఆలీషా వారి 140వ జయంతి వేడుకలకు అనంతపురం వేదిక కావడం తనకు అమితానందం కలిగించింది అని చెప్పారు. ఇకపై వీరి సాహిత్యంపై ఇక్కడ సాహిత్య సమితి వారు కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ మురళీధర్ గారు మాట్లాడుతూ సూఫీ వేదాంతం మానవ సమాజంలో మానవత్వానికి ప్రాధాన్యతను ఇచ్చి, మనిషిలో ఉన్న దైవత్వాన్ని గురించి బోధించిన విశిష్ట అద్వైత ముస్లిం వేదాంత సాహిత్యం అని, దానిని నేడు ఈ పీఠాధిపతులు ప్రబోధిస్తూ నేటి భారతీయ సమాజంలో మత సామరస్యాన్ని నెలకొల్పుటకు కృషి చేయడం శ్లాఘనీయం అని కొనియాడారు.
శ్రీమతి గాజుల పద్మజగారు భారత రాజ్యాంగం కల్పించిన సర్వమత సామరస్యాన్ని బోధిస్తున్న ఈ ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం సమాజానికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుందని అన్నారు. పీఠాధిపతులు డా. ఉమర్ అలీషా వారు మతసామరస్యం పై అనుగ్రహ భాషణం చేసారు.
కార్యక్రమం ప్రారంభంలో శ్రీమతి సంధ్యమూర్తి చిన్నారులు బృందం చేసిన గురు స్వాగత నృత్యం సభికులకు కనువిందు చేసింది. నా మొక్క నా శ్వాస కార్యక్రమాల్లో భాగంగా గురువర్యులు లలిత కళాసమితి ఆవరణలో పూలమొక్క చిన్నారి నవనిచే నాటించారు. అనంతపురం జిల్లాలో వివిధ గ్రామాలలో వెయ్యి మొక్కలు ఇప్పటికి నాటిన అనంతపురం కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని ఏస్. నవనిని గురువర్యులు వెయ్యి రూపాయలు నగదు బహుమతితో సత్కరించారు. గురువర్యుల చేతులు మీదుగా అతిథులను, జయంతి ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించారు. అనంతరం గురువర్యులను సాహితీ సమితి సభ్యులు సత్కరించారు. సభానంతారం సభికులు గురువర్యులను దర్శించి శుభాశీస్సులు అందుకున్నారు. తునుకుల రమేష్ గారి వందన సమర్పణతో సభ ముగిసింది. సభానంతరం అనంతపురం సాయి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ విజయ సాయి కుమార్, వై.రుక్మిణీదేవిగార్లు అందించిన గురుభిక్ష వందనం ద్వారా గురువర్యులకు, అతిథులకు కడుపునిండా విందుభోజనం అందించి ఆనందించారు. 1916లో స్థాపించిన అనంతపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యవర్గం వారి ఆహ్వానంతో గురువర్యులు బ్యాంకును సందర్శించారు. బ్యాంకు కార్యవర్గం గురువర్యులను బ్యాంకు కేంద్ర కార్యాలయంలో సన్మానించి ఆశీస్సులు పొంది తరించారు. అనంతపురం ఉమర్ ఆలీ షా సాహితీ సమితి కార్యవర్గం సభ్యులు గురువర్యులకు ఘనమైన వీడ్కోలు పలికి, వచ్చే సంవత్సరం జయంతి సభకు ఎదురుచూస్తూ ఉంటామని, గురువర్యులు తప్పకుండా విచ్చేసి సభ నిర్వహణకు వారి శుభాశీస్సులు అందచేయాలని కోరారు.