Avatari Sri Hussain Sha Sathguru 119th birthday celebrations | 9th September 2024
Avatari Sri Hussain Sha Sathguru 119th birthday celebrations | 9th September 2024
మానవ వ్యవస్థను సవ్యదిశలో పయనింప చేసేదే ఆధ్యాత్మికత – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు
ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మానవునికి మంచి, చెడులను విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని, మానవ వ్యవస్థను సవ్యదిశలో పయనింప చేస్తుందని పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా 119వ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. మానవుడిలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే సమాజంలో దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తన జీవనవిధానంలో భ్రాంతి శక్తులకు లోనవుతూ అశాంతికి, అసంతృప్తికీ గురవుతున్న మానవుడు తాను నష్ట పోవడమే కాకుండా తోటి వారిని కూడా నష్టపరుస్తున్నాడని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానవుడికి మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు. మనసును అల్లకల్లోలం చేసేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో కూడిన అరిషడ్వర్గాలను స్థాయిపరచుకుంటే మంచి, చెడులను విశ్లేషించుకునే శక్తి లభిస్తుందని తెలిపారు. చిన్నతనం నుండీ ప్రతివ్యక్తీ తాత్విక జ్ఞానాన్ని అలవరచుకుంటే తన జీవితకాలమంతా ప్రశాంతంగా జీవనం కొనసాగించగలుగుతాడని అన్నారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అలవరచుకోవడం ద్వారా తాత్విక జ్ఞానం తెలియబడుతుందని తెలిపారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువర్యులు రచించిన మహోత్కృష్ట గ్రంథం షాతత్వాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని తెలిపారు. మానవ జీవన మనుగడకు దిక్సూచి షాతత్వ గ్రంథమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పీఠం సభ్యులకు పిలుపునిచ్చారు.
సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ మురళీకృష్ణ, రిజిస్ట్రార్ డాక్టర్ రవీంద్రనాథ్, శతావధాని శ్రీ ఆముదాల మురళి, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ఛైర్మన్ పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ రావులు మాట్లాడుతూ మానవులు భేదభావాలను విడనాడి, సాటి మానవుని పట్ల సమదృష్టి కలిగి ఉండాలని సభ్యులకు బోధిస్తూ విశ్వ మానవ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని తెలిపారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవలను రెండు నేత్రాలుగా చేసుకుని పీఠాధిపతి ఆలీషా చేస్తున్న సేవలను కొనియాడారు.
తదుపరి విజ్ఞాన జ్యోతి గ్రంథాన్ని కన్నడ భాషలోనికి అనువదించిన ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకుడు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిని పీఠాధిపతి సత్కరించారు. పీఠం ముద్రించిన అనేక గ్రంథాలను ముఖ్య అతిథుల సమక్షంలో ఉమర్ ఆలీషా స్వామివారు ఆవిష్కరించారు.