Guru Pournami Sabha | గురుపౌర్ణమి సభ 3rd July 2023

జీవన తత్త్వానికి దిక్సూచి గురువు.
…………………………………………………….
పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు

మానవుని జీవన తత్త్వానికి దిక్సూచి గురువు అని, సద్గురువును ఆశ్రయించి జీవన తత్త్వాన్ని ఆధ్యాత్మికతత్త్వంగా మార్చుకోగలిగినట్లయితే మానవుని జీవన విధానంలో చక్కని ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పీఠాధిపతులు డా॥ ఉమర్ ఆలీషా స్వామివారు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో గురువును పూజిస్తూ గురువు ఔన్నత్యాన్ని గ్రహిస్తూ గురుతత్త్వాన్ని పొందిన మానవుడు జీవన తత్త్వంలో వాటిని అలవర్చుకోవాలని అన్నారు. గురు మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే
అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. మానవుని జీవన విధానానికి దశ దిశ నిర్దేశించే తాత్త్వికులు గురువులు అని అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులకు సూచించారు.
వృక్షో రక్షతి రక్షితః అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించాలని పేర్కొన్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనే పేరుతో గత 15 సంవత్సరాలుగా లక్షలాది మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. త్వరలో రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఉద్యాన వనాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
అనంతరం ఫర్జానా ఆలీషా మాతృమూర్తి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక సంచిక ఆన్లైన్ ఎడిషన్‌ను పీఠాధిపతులు ముఖ్య అతిథుల సమక్షంలో సభలో ఆవిష్కరించారు.

సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె.పద్మరాజు మాట్లాడుతూ సర్వ మతాలు సమానమే అనే విషయాన్ని బోధించడానికి ఏర్పడిన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. ఓవైపు ఆధ్యాత్మిక తత్త్వ ప్రబోధం, మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ విశ్వ మానవ కల్యాణానికి పాటుపడుతున్న పీఠాధిపతి ఉమరాలీషా స్వామివారిని చూస్తే దైవం మానుష రూపేణ అనే విషయం తేటతెల్లమవుతుందని తెలిపారు. సాటి వారికి సాయం చేసే వ్యక్తుల్లో భగవంతుడు దర్శనమిస్తాడని అన్నారు. పీఠాధిపతుల ఆశీస్సులతో తాను జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. ప్రతి మానవుని జీవితంలో మొదటి గురువు తల్లి తదుపరి తండ్రి అటుపై గురువు అని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులను గౌరవించకుండా గురువును ఆశ్రయించడం వల్ల ఫలితం ఉండదని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో అధికశాతం యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిపోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని తెలిపారు. పిల్లలకు మంచి చెడులను గురించి వివరించాలని అన్నారు.

గౌరవ అతిథి శ్రీ పరవస్తు ఫణిశయన సూరి గురు పౌర్ణమి యొక్క విశిష్టతను సభకు వివరించారు

పీఠం నిర్వహిస్తున్న తాత్త్విక బాలవికాస్ శిక్షణ పొందుతున్న చిన్నారులు మాస్టర్ రేఖా ఉషా కిరణ్, గుమ్మళ్ల తన్మయ శ్రీ సాయి దుర్గ, సిహెచ్ పవన్‌ల ఆధ్యాత్మిక ప్రసంగాలు సభ్యులను ఆకట్టుకున్నాయి. తదుపరి ఎన్. ఆర్. ఐ. శ్రీ ఎర్రా కృష్ణ కిషోర్ సభలో ప్రసంగించారు.

సభలో పీఠం సభ్యురాలు ఎ.ఉమ పర్యవేక్షణలో చిన్నారులు ఆలపించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి. సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులకు పీఠం వద్ద భోజన సదుపాయం కల్పించారు.

ఈ సందర్భంగా 216 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు.

News Paper

News Channels

You may also like...