28th Anniversary Spiritual Meeting at Tuni on 3rd March 2025
బ్రహ్మర్షి కహెనేషావలి సద్గురువర్యులు (చతుర్ధ పీఠాధిపతి) దర్గ 28వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభ (సర్వ మత సమ్మేళన సభ) 03-03-2025 న తుని నందు నిర్వహించబడింది.

మతాధిపతుల ప్రసంగ సారాంశం.
- డా.వాసిలి వసంత కుమార్, యోగాలయ, సికింద్రాబాద్ మాట్లాడుతూ ధ్యాన స్థితిలో ఉండి జ్ఞాన బోధ వినాలి. 200 సంవత్సరాల క్రితం చతుర్థ పీఠాధిపతిగారు సభ్యుల మనో అభీష్టములకు అనుగుణంగా మహోన్నతమైన ఆధ్యాత్మిక తత్త్వం బోధించే వారు అని అన్నారు. వారు రచించిన కల్కి భాగవతం ప్రత్యేకత ఏమిటి అంటే మహోన్నతమైన దరువు కీర్తనలు అనే సాహిత్య ప్రక్రియలో రచించారు. ప్రతీ కీర్తనలో అందు అనే పదాన్ని ప్రామాణిక స్వరం వారి సాహిత్యంలో వాడారు. నేను అనే పదం ఆత్మ విశ్వాసానికి ప్రతీక.
- హిందూ ధర్మ ప్రతినిధి – చిన్మయ మిషన్, విజయనగరం, శ్రీ స్వామి విజయానంద మాట్లాడుతూ మనస్సు, ఇంద్రియములు నియంత్రించుకొనుట ద్వారా తప్పుడు ఆలోచనలు ఆగి, అంతఃకరణ శుద్ధి అవును. సర్వే సంతు నిరామయాః అనగా మంచి ఆరోగ్యంతో ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు అనగా ప్రతీ ఒక్కరూ అందరిలో ఉన్న మంచిని గ్రహించాలి. ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొంద కుండా ఉండగాక! సర్వే జనాః సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః అని ప్రసంగం ముగించారు.
- క్రైస్తవ ధర్మ ప్రతినిధి Rev. S. బాలసౌరి, హంసవరం మాట్లాడుతూ క్రైస్తవం అంటే ప్రేమకు ప్రతిరూపం. మానవులు ఒకరిని మరొకరు ప్రేమించుకోవాలి. ఒకరికి మరొకరు సహాయం చేసుకోవాలి. సత్ ప్రవర్తన కల్గిన వాడే దేవునికి అంగీకార యోగ్యుడు అన్నారు.
- విజయవాడ సూఫీ షేక్ అహ్మద్ జానీ మాట్లాడుతూ సద్గురువు జ్ఞాన బోధ భిన్నత్వంలో ఏకత్వమునకు ప్రతీక. 5 శాంతి సూత్రాలను అందరూ పాటించాలి. ఈశ్వరులు ఎంత మంది ఉన్నా జగదీశ్వరుడు ఒక్కడే. గురువులు ఎంతమంది ఉన్నా సద్గురువు ఒక్కరే. గ్రంథాలు అన్నీ సర్వ ధర్మ గ్రంథాలే. ప్రార్థనలు అన్నీ విశ్వ ధర్మ ప్రార్థనలే. ప్రతీ ఒక్కరూ గ్రహిస్తే విశ్వ శాంతి సాధ్యం అగును అన్నారు.
- బౌద్ధ ధర్మ ప్రతినిధి పూజ్య భంతే ఆంధ్రా అనాలియో మాట్లాడుతూ పాపాలు చేయకు, కుశల కర్మలు మాత్రమే చెయ్యి. మీ మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే 1.శ్రద్ధ 2.దానము 3.శీలాచరణ 4.సద్భావన అలవరచుకొంటే రాగ ద్వేషములు నియంత్రణ చేసుకోవచ్చు. సత్యం నుండి దూరంగా పోవద్దు. జీవించుట నుండి దూరంగా పోకూడదు అన్నారు.
- సిక్కు మత ప్రతినిధి శ్రీ గురు చరణ్ సింగ్ కలసా మాట్లాడుతూ గురు నానక్ తత్త్వం తెలియచేశారు. పరమాత్మను చేరాలి అంటే ఒక్క గురువు ద్వారా మాత్రమే సాధ్యం. సత్సంగం, భజన ద్వారా గురుతత్త్వం తెలుసుకోవచ్చు అన్నారు. దాన ధర్మములు చేయండి. ఇతరుల గురించి నీచముగా మాట్లాడవద్దు అన్నారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారితో చెయ్యి చెయ్యి కలిపి, దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం కృషి చేస్తామని మతాధిపతులంతా ప్రతిజ్ఞ చేశారు.